Syamantaka Story - Telugu
శ్రీకృష్ణుడి నివాసస్థలం ద్వారకలో సూర్యుడి భక్తుడైన రాజు సత్రాజిత్తు ఉండేవాడు. ఆయన్ని పూజించటం వలన, సూర్యుడు అద్భుతమైన రత్నం శ్యమంతకాన్ని సత్రాజిత్తుకి బహూకరించాడు. ఎవరైతే ఆ మణిని నిరంతరం పూజిస్తారో వారి సంపదలు రెట్టింపవుతూనే ఉంటాయి.
ఒకరోజు, శ్రీకృష్ణుడు కూడా ఈ అద్భుతమైన మణిని చూడటానికి వచ్చాడు. సత్రాజిత్తు అనుమానంతో మణి సంరక్షణ బాధ్యత ఇవ్వకుండా దాచిపెట్టాడు. కొంతకాలం తర్వాత, పౌర్ణమికి నాలుగోరోజున శ్రీకృష్ణుడి భార్య రుక్మిణి ఆయనకు పాయసం వండిపెట్టింది. అది తింటూ కృష్ణుడు చంద్రుడి ప్రతిబింబాన్ని పాలల్లో చూసి, గణేషుడి శాపం వలన తను కూడా నింద పడాల్సి వస్తుందని గ్రహించాడు. ఎవరైతే చవితినాడు చంద్రుడ్ని చూస్తారో వారు నిందలపాలవుతారని గణపతి శాపం.
అదేసమయంలో, ఆరోజునే సత్రాజిత్తు సోదరుడు ప్రసేనుడు శ్యమంతకమణిని తీసుకుని వేటకు వెళ్తాడు. వేట సమయంలో సింహం అతనిపై దాడిచేసి చంపేసి శ్యమంతకమణిని మాంసం అనుకుంటుంది. తన గుహలోకి ఆ మణిని తీసుకుపోతుంది.
జాంబవంతుడు(సీతని రక్షించడానికి రాముడికి సాయపడ్డవాడు) అనే ఎలుగుబంటి సింహాన్ని చంపేసి ఆ రత్నాన్ని తన కూతురు జాంబవతికి బహుమతిగా ఇస్తాడు. ప్రసేనుడు వేటనుంచి తిరిగిరాకపోవటంతో సత్రాజిత్తు శ్రీకృష్ణుడ్ని తన మణిని దొంగిలించి, తమ్ముడ్ని చంపేసాడని అనుమానిస్తాడు. ఈ నిందలతో బాధపడిన కృష్ణుడు తనే ప్రసేనుడిని వెతకడానికి వెళ్ళి గుహ ముందు అతని శవాన్ని చూస్తాడు.
సింహం కాలిగుర్తుల ప్రకారం కృష్ణుడు గుహలోకి వెళ్ళి జాంబవతి రత్నంతో ఆడుకోవడం చూస్తాడు. మణికోసం కూతురిపై దాడి చేయడానికి వచ్చాడేమోనని భయపడి జాంబవంతుడు కృష్ణుడితో పోరాడతాడు.28రోజులు వరుసగా పోరాడాక, జాంబవంతుడికి కృష్ణుడు మామూలు రాజు కాదని అర్థమవుతుంది. నిజంగా అతనెవరోనని అడుగుతాడు.
శ్రీకృష్ణుడు పూర్వజన్మలో తనెలా రాముడిగా పుట్టాడో, జాంబవంతుడు ఎలా సీతను రక్షించడానికి సాయపడ్డాడో గుర్తుచేస్తాడు. జాంబవంతుడికి తన తప్పు త్వరగా తెలుసుకుని,రత్నాన్ని, తన కూతురు జాంబవతిని కృష్ణుడికి అప్పగిస్తాడు.
తిరిగొచ్చాక, శ్రీకృష్ణుడు నేరుగా సత్రాజిత్తు భవనానికి వెళ్ళి అతని సోదరుడి శవం మరియు శ్యమంతకమణిని అప్పగిస్తాడు. సత్రాజిత్తు తన తప్పు తెలుసుకుని క్షమాపణ కోరతాడు. కృతజ్ఞతగా తన కూతురు సత్యభామను, శ్యమంతకమణిని శ్రీకృష్ణుడికి అప్పగిస్తాడు.
గణేషుడి శాపం వలన కృష్ణుడు నిందను భరించాల్సి వచ్చింది. ఆరోజునుంచి కృష్ణుడు కూడా వినాయకుడ్ని పూజించటం మొదలుపెట్టాడు.